నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ భేటీలో 50 వేల ఉద్యోగ నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది . కరోనా స్థితిగతులు, పల్లె, పట్టణ ప్రగతి పురోగతి, వ్యవసాయం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎజెండాలో 22కి పైగా అంశాలున్నాయి. ఏపీతో జల వివాదంపై కూడా చర్చించనున్నారు. తెలంగాణలో కొత్త జోన్ల వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా.. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి పూనుకుంటోంది. దాదాపు యాభైవేల ఉద్యోగాల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో 50 వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శాఖల వారీగా అధికారులు ఖాళీల వివరాలు సేకరించారు. ఉద్యోగుల పదోన్నతులపైనా నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని 32 శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కృష్ణా జలాలపై కేంద్రం వైఖరి, విభజన హామీల అమలులో జాప్యం, పెండింగు ప్రాజెక్టులు, ఇతర డిమాండ్లపై అనుసరించాల్సిన వ్యూహం, హుజూరాబాద్ ఉప ఎన్నికల కార్యాచరణ ప్రణాళికపైనా చర్చించే అవకాశం ఉంది.