ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరీక్షిస్తున్న వారికి గుడ్‌న్యూస్..ఊపందుకోనున్న నిర్మాణాలు
పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట వేసింది
By Knakam Karthik
ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరీక్షిస్తున్న వారికి గుడ్‌న్యూస్..ఊపందుకోనున్న నిర్మాణాలు
పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట వేసింది. ఈ పథకానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యతను ఇచ్చింది. కాంగ్రెస్ పేర్కొన్న ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్లను ఎక్కువగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో కొత్త ఇళ్లను నిర్మించడమే కాకుండా గత ప్రభుత్వ హయాంలో వివిధ దశల్లో నిలిచిపోయిన రెండు పడక గదుల ఇళ్లను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.12,571 కోట్లను కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం ఊపందుకోనుంది. ఏటా నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఆ మేరకు భారీగా నిధులను ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది గుడ్‌న్యూస్ అయింది.
గతంలో కంటే ఎక్కువగా నిధులు కేటాయింపు..
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12,571 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.8,424.06 కోట్లను కేటాయించగా ఈసారి ఆ నిధులను రూ.4,147 కోట్లకు పెంచింది. ఏటా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో గరిష్ఠంగా 4.50 లక్షల ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున కేటాయిస్తోంది. ఇందులో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను కేటాయించనుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 80.54 లక్షల దరఖాస్తులు రాగా అధికారులు వాటిని ఇందిరమ్మ ఇళ్ల యాప్‌తో సర్వే జరిపి ఎల్-1,2,3 విభాగాలుగా వర్గీకరించారు.
మొన్నటివరకు ఎన్నికల కోడ్ అడ్డంకి
కాగా.. మొన్నటివరకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఇటీవల ఆ కోడ్ కూడా ముగియడంతో ఇక ఇళ్ల నిర్మాణం ఊపందుకోనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 72వేల మంది వరకు లబ్ధిదారులను ఎంపిక చేయగా.. వారికి జనవరి 26న మంజూరు పత్రాలు ఇచ్చారు. అందులో నుంచి పలు ఇళ్ల నిర్మాణాలు సైతం ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే.. రెండో విడత కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. ఎట్టకేలకు బడ్జెట్‌లో కూడా భారీగా కేటాయింపులు జరగడంతో ఈ ప్రక్రియను మరింత వేగవంతంగా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.