తొమ్మిదిన్నరేళ్ల పాలనపై బీఆర్ఎస్ 'స్వేద పత్రం'
గత తొమ్మిదిన్నరేళ్ల పాలనపై బీఆర్ఎస్ స్వేద పత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 6:50 AM GMTతొమ్మిదిన్నరేళ్ల పాలనపై బీఆర్ఎస్ 'స్వేద పత్రం'
గత తొమ్మిదిన్నరేళ్ల పాలనపై బీఆర్ఎస్ స్వేద పత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్, బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తోందిన ఆయన విమర్శించారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్‌ను, గత పదేళ్ల పాలనను బద్నాం చేస్తోందని చెప్పారు. తప్పుడు మాటలు చెప్పి ప్రజల్లో అపోహ, అనుమానాలు సృష్టిస్తోందని మండిపడ్డారు కేటీఆర్. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గొంతు నొక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
శ్వేత పత్రాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో హడావుడి చేసి పారిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ లేవనెత్తిన సందేహాలు, ఆరోపణలపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందనీ.. అందుకే స్వేద పత్రాన్ని విడుదల చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పదేళ్లు చమటోడ్చి, రక్తాన్ని రంగరించి.. వందలు, వేల గంటలు పని చేశామని కేటీఆర్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం మాత్రమే కాదు.. లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో.. కష్టంతో అభ్యున్నతికి తోడ్పడ్డారని కేటీఆర్ అన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు.. సంక్షోభం నుంచి సమృద్ధి వైపు జరిగిన ప్రయాణమని కేటీఆర్ చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలనపై అన్నీ అసత్యాలే ప్రచారం చేస్తోందని కేటీఆర్ అన్నారు. అప్పుల విషయంలో అన్నీ తప్పులే చెబుతున్నారని అన్నారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధి తీసుకొచ్చిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందించడంతో సస్యశ్యామలం అయ్యిందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు ఉండేవని గుర్తు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేంద్రమే ఎన్నోసార్లు ప్రశంసలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నో రంగాల్లో రాష్ట్రానికి అవార్డులు కూడా దక్కాయని చెప్పారు కేటీఆర్. తాగునీటి, సాగునీటి అవసరాలను కూడా తీర్చామని చెప్పారు. పరిపాలనలో సంస్కరణలు, కొత్త చట్టాల ద్వారా సుపరిపాలన అందించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణను అనేక రంగాల్లో దేశంలోనే టాప్‌లోకి తీసుకెళ్లామని అన్నారు. ఇక ఐటీ రంగంలో అయితే.. ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సాధించామన్నారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ పాలనలో ఏమీ అభివృద్ధి జరగలేదన్నట్లు మాట్లాడటం సరికాదని చెప్పారు.