హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని కుట్ర చేస్తున్నారు: హరీశ్‌రావు

కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా హరీశ్‌రావు ప్రచారంలో పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on  3 May 2024 1:15 PM IST
telangana, brs, harish rao,   congress government,

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని కుట్ర చేస్తున్నారు: హరీశ్‌రావు

సిద్దిపేట జిల్లా అక్కంపేటలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ భవిష్యత్‌, తలరాతను మార్చే ఎన్నికలు ఇవే అని హరీశ్‌రావు చెప్పారు. రేవంత్‌రెడ్డి చంద్రబాబుతో కలిసి పనిచేస్తారని చెప్పారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలని చంద్రబాబు లాంటి వారు కుట్ర చేస్తున్నారంటూ హరీశ్‌రావు ఆరోపించారు. వీరి ఆటలు సాగకూడదు అంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలిన హరీశ్‌రావు పిలుపునిచ్చార.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయని హరీశ్‌రావు విమర్శించారు. అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్లు అయ్యిందన్నారు. కాంగ్రెస్‌ బాండు పేపర్లు బౌన్స్‌ అయ్యాయనీ.. అందుకు కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో మంచినీల్లు కరవు అయ్యాయనీ.. పెన్షన్లు రావడం లేదు అని హరీశ్‌రావు చెప్పారు. కేసీఆర్‌ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన పథకాలను ప్రస్తుత ప్రభుత్వం తీసేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అందరికీ గోవిందా గోవిందా పాట గుర్తుకువస్తోందని చెప్పారు. దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పెన్షన్‌ అన్నీ గోవిందా చేశారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు.

తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష కేసీఆరే అని హరీశ్‌రావు చెప్పారు. కేసీఆర్ పాలనలో నిరంతర విద్యుత్‌, కేసీఆర్ కిట్‌, సాగునీళ్లు, మెడికల్ కాలేజీలు ఇలా ఒక్కటేమిటీ అన్నీ అందాయని గుర్తు చేశారు. గుంపు మేస్త్రికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అన్నట్లుగానే తయారైంది రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. ఎవరు మేలు చేశారో గుర్తించి అదే పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా వినోద్‌ను గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి.. ఆ పార్టీ ఇచ్ ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామని హరీశ్‌రావు చెప్పారు. ఇక గత ఐదేళ్లలో కరీంనగర్‌ ఎంపీగా బండి సంజయ్ చేసిందేమీ లేదన్నారు. ప్రజలకు మంచి చేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్సే అనీ.. తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఉండాలని హరీశ్‌రావు ఈ సందర్భంగా కోరారు.

Next Story