కాంగ్రెస్ దోపిడీకి అక్షయపాత్రగా తెలంగాణ: టి.బీజేపీ చీఫ్
కాంగ్రెస్ దోపిడీకి అక్షయపాత్రగా తెలంగాణ మారింది..అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు.
By Knakam Karthik
కాంగ్రెస్ దోపిడీకి అక్షయపాత్రగా తెలంగాణ: టి.బీజేపీ చీఫ్
కాంగ్రెస్ దోపిడీకి అక్షయపాత్రగా తెలంగాణ మారింది..అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు. ఎల్బీస్టేడియంలో కాంగ్రెస్ నిర్వహించనున్న సభపై రామచందర్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. సామాజిక న్యాయానికి తూట్లు పొడించేందుకే కాంగ్రెస్ సభ అని విమర్శించారు. గ్యారంటీలు, హామీల పేరుతో హడావుడి, అమలులో శూన్యం. బీసీలకు తీవ్ర అన్యాయం ఎస్సీ, ఎస్టీలకు సంకెళ్లు..భీమ్ పేరుతో నాటకం. ఎమర్జెన్సీతో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాలకు కాంగ్రెస్ తూట్లు పొడుస్తుంది. న్యాయాన్ని, రాజ్యాంగ విలువలను కాంగ్రెస్ ఖూనీ చేసింది. పదే పదే ప్రజలను మభ్యపెట్టే నినాదాలు చెప్పే కాంగ్రెస్..వాటికి విరుద్ధంగా పని చేయడమే తన నిజమైన ధోరణి..అని విమర్శించారు.
సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ "సామాజిక న్యాయ సమరభేరి" అంటూ మరోసారి తెలంగాణ ప్రజలను మాయచేయాలని చూస్తోంది. ఏడాదిన్నర పాలనలో ఒక్క హామీని కూడా సమర్థంగా అమలు చేయలేకపోయిన ప్రభుత్వం… ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది? "జై బాపు" అంటూ నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, గాంధీజీ కలల గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం, గ్రామాభివృద్ధి పనుల బిల్లులకు రూ.1,200 కోట్లు పెండింగ్ లో పెట్టడం ఇవన్నీ గాంధీజీ స్ఫూర్తికి విరుద్ధం. "జై భీమ్" అంటూ నినదిస్తున్న కాంగ్రెస్, వాస్తవంగా లగచర్ల, కొండగల్ వంటి ప్రాంతాల్లో గిరిజనుల భూములు లాక్కొని, పోడు భూములపై బుల్డోజర్లు పంపి, ఎస్టీ రైతులపై కేసులు బనాయించి, గురుకులాల మూసివేతలతో దుర్మార్గంగా వ్యవహరించింది. "జై సంవిధాన్" అని పఠించే ముందు కాంగ్రెస్ పార్టీ తన చరిత్రను గమనించాలి. 1975లో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీకి రాజ్యాంగంపై బోధనలు చెప్పే అర్హత లేదు. ఇవన్నీ మరిచినట్టుగా మల్లికార్జున ఖర్గే గారు నేడు తెలంగాణకు వచ్చారు. కానీ ప్రజల మనసులో ఉన్న అసలైన ప్రశ్న ఒక్కటే... ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకుని సభ నిర్వహిస్తోంది? ఇంకా దోచుకోవడానికి ఏమి మిగిలింది? కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ… ఈ మూడు రాష్ట్రాలూ కాంగ్రెస్ దోపిడీకి అక్షయపాత్రలుగా మారాయి..అని రామచందర్ రావు ఆరోపించారు.