తెలంగాణలో బస్సు యాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ నేతలు
తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతలు బస్సు యాత్రకు సిద్ధం అవుతున్నారు.
By Srikanth Gundamalla Published on 30 Jan 2024 10:28 AM ISTతెలంగాణలో బస్సు యాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ నేతలు
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇంకొద్ది నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. దాంతో.. రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాయి. ఏఏ చోట్లలో అభ్యర్థులను ఎవరిని నిలబెట్టాలనే విషయంతో పాటు.. ఇతర పార్టీలను కలుపుకొని కూటములుగా ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని బావిస్తోంది.
ఇక తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్‌కు షాక్ ఎదురైందనే చెప్పాలి. ఇక బీజేపీ మాత్రం గత 2018 ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం పెంచుకుంది. పైగా అప్పుడు ఒకే ఒక ఎమ్మెల్యే గెలవగా ఈసారి 8 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే.. బీజేపీ అధిష్టానం ఆశించిన ఫలితం కాకపోయినా.. ఓటింగ్ శాతం పెరగడం మాత్రం శుభసూచకంగా భావించారు కమలం నేతలు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే సత్తా చాటా మెజార్టీ స్థానాల్లో గెలవాలని చూస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతలు బస్సు యాత్రకు సిద్ధం అవుతున్నారు.
17 లోక్‌సభ స్థానాలను నాలుగు కస్టర్లుగా బీజేపీ విభజించింది. లోక్‌సభ క్లస్టర్స్‌లో 11 రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 10వ తేదీ ఉంచి 20వ తేదీ వరకు తెలంగాణలో బీజేపీ నాయకులు బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు. రోడ్‌షోలతో పాటు.. బస్సు యాత్రల్లో కార్నర్ మీటింగ్స్, బహిరంగ సభలను నిర్వహించనుంది. ఈ యాత్రలో తెలంగాణ బీజేపీ నేతలతో పాటు.. జాతీయ ముఖ్య నేతలు కూడా పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓట్ షేర్‌తో పాటు.. 10 సీట్లలో గెలుపే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ముమ్మరంగా ముందుకు వెళ్తుంది.