తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన 'అల్లిపూల వెన్నెల' బతుకమ్మ పాట వచ్చేసింది. ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించగా.. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ పాటను ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లోని తన నివాసంలో మంగళవారం విడుదల చేశారు ఉత్తరా ఉన్నికృష్ణన్ పాడిన పాటను ప్రముఖ రచయిత మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందించారు. జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ చేశారు. ప్రముఖ గాయని పాడిన ఈ పాటను యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి సమీపంలో గత నెల 29, 30 తేదీలలో చిత్రీకరించారు.
తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకొనే బతుకమ్మ పండుగకు ''అల్లిపూల వెన్నెల'' మరింత శోభ తీసుకొస్తుందని అందరూ భావిస్తున్నారు. తెలంగాణలో మాత్రమే జరుపుకొనే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక ప్రతీక. ఈ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో తెలంగాణ జాగృతి కీలకపాత్ర పోషించింది. పాటను విడుదల చేసిన అనంతరం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేస్తూ.. బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఆ ట్వీట్‌ను ఎమ్మెల్సీ కవిత రీట్వీట్ చేశారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ను కవిత సత్కరించారు.