మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ సవాల్
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 13 April 2024 6:54 AM ISTమంత్రి పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ సవాల్
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి. కొందరు నాయకులు తమ అధిష్టానం వ్యవహారంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీని వీడుతున్నారు. ప్రత్యర్థి పార్టీల్లో చేరుతూ.. అవకాశాలను దక్కించుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము అధికస్థానాల్లో గెలుస్తామంటే.. తామే విజయం సాధిస్తామంటూ దీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా.. తాజాగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బీజేపీ జాతీయ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని బండి సంజయ్ గుర్తు చేశారు. కానీ.. ఇప్పటి వరకు అన్ని గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ పదేళ్ల పాలనలో ప్రజలకు ఎంతో అన్యాయం జరిగిందని చెప్పడాన్ని బండి సంజయ్ ఖండించారు. అందుకు నిరసనగా ఈ నెల 14న కరీంనగర్‌లో దీక్ష చేస్తానని మంత్రి పొన్నం చెప్పడం పట్ల బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.
ప్రధాని మోదీ పాలనలో దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు అయ్యాయని గుర్తు చేశారు బండి సంజయ్. కరోనా సమయంలో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చారని.. అందుకే దీక్ష చేస్తారా అంటూ పొన్నం ప్రభాకర్‌ను నిలదీశారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్దికి రూ.12వేల కోట్లు ఇచ్చినందుకా అంటూ ప్రశ్నించారు. 370 ఆర్టికల్‌ను రద్దు చేసి కాశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేసినందుకు దీక్ష చేస్తారా? అన్నారను. దేని కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష చేస్తానని అంటున్నారో చెప్పాలని బీజేపీ నేత బండి సంజయ్ డిమాండ్ చేశారు.