తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ ను ఎన్నుకున్నారు.

By Medi Samrat  Published on  13 Dec 2023 6:30 PM IST
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ ను ఎన్నుకున్నారు. డిసెంబర్‌ 13వ తేదీ బుధవారం నాడు, అన్ని ప్రధాన పార్టీలు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. శాసన సభ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది. స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. సభాపతి నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావును మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానించారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వెళ్లి కేటీఆర్‌తో భేటీ అయిన శ్రీధర్ బాబు నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించారు. స్పీకర్ పదవికి ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. నామినేషన్ పత్రాలపై ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ కేటీఆర్ సంతకం చేశారు.

తెలంగాణ స్పీకర్ గా ఎన్నికైన తొలి దళిత వ్యక్తి గడ్డం ప్రసాద్. రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జన్మించిన ప్రసాద్ 2008 ఉపఎన్నికలో వికారాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2012లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన వరుసగా ఓటమిపాలయ్యారు. అయితే 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నియమితులయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వికారాబాద్ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు స్పీకర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు. కేవలం ఇంటర్ వరకు మాత్రమే చదివారు ప్రసాద్.

Next Story