తెలంగాణ స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలను ఎదుర్కొంటున్నా: పవన్ కళ్యాణ్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీట్ పుట్టిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 23 Nov 2023 2:53 PM ISTతెలంగాణ స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలను ఎదుర్కొంటున్నా: పవన్ కళ్యాణ్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీట్ పుట్టిస్తున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అభ్యర్థుల తరఫున పార్టీ పెద్దలు పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జనసేప పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. జనసేన కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. కొత్తగూడెం నుంచి జనసేన తరఫున సురేందరరావు ఎన్నికల బరిలో దిగారు. ఈ సందర్భంగా సురేంద్ర రావు తరఫున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ ఒక్కోసారి ఒకరితో ఉంటారని.. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతావ్ అని చాలా మంది అంటుంటారని అన్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ తనది హ్యూమనిజమని పేర్కొన్నారు. తనకు తెలంగాణ నేల సనాతన ధర్మం నేర్పిందనీ, ఉద్యమం నుంచి పట్టుదల నేర్చుకున్నానని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడాలని పిలుపునిచ్చారు. అయితే.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలను, గూండాలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో జనసేన కేడర్, జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో బీజేపీ క్యాడర్ బలంగా పనిచేయాలన్నారు.
తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఉద్యమ ఫలితం మాత్రం దక్కలేదన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే యువతకు జనసేన అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణలో తాను పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయినా.. జనసేన పార్టీ బలంగా ఉందంటే దానికి కారణం పార్టీ సైనికులు, వీరమహిళలే అన్నారు పవన్. కొత్తగూడెం నియోజకవర్గంలో కార్తిక్ వేమల పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని ప్రశంసించారు. అయితే.. ఇక్కడ ఎన్నిక పోటీలో సీనియర్ నేత లక్కినేని సురేందర్‌ను నిలబెట్టేందుకు.. కార్తిక్ స్వచ్ఛంగా మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడటం లేదని కొందరు అంటున్నారనీ గుర్తు చేశారు పవన్. బలిదానాలు, పోరాటాలపై ఏర్పడిన రాష్ట్రం.. అలాగే తాను రాష్ట్రంలో పూర్తిగా తిరగలేదు కాబట్టే మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ప్రతి ఒక్కరికీ జనసేన మద్దతు ఉంటుందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పారు.