Telangana: అసెంబ్లీలో నల్ల బ్యాడ్జీలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  1 Aug 2024 5:44 AM GMT
telangana, assembly, brs, ktr,  mla, black badges,

Telangana: అసెంబ్లీలో నల్ల బ్యాడ్జీలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడారంటూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా నల్ల బ్యాడ్జీలను ధరించి సభకు హాజరు అయ్యారు. మహిళా ఎమ్మెల్యేలకు సీఎం, డిప్యూటీ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సభ ప్రారంభం అయిన వెంటనే ఇదే విషయంపై నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నిరసనల మధ్యే మంత్రి శ్రీధర్‌ బాబు స్కిల్ యూనివర్సిటీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే.. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టు పడుతున్నారు.

బుధవారం శాసనసభలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మాట్లాడిన తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మహిళల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి అలా మాట్లాడటం ఆశ్చర్యానికి గురిచేసిందని కేటీఆర్‌ అన్నారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా.. ఎంతో హుందాగా, ప్రజలకు సేవ చేసే గుణం వారిది అని కేటీఆర్ అన్నారు. అలాంటి మహిళ నేతలను చులకనగా మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు వారిద్దరిపై మాత్రమే కాదు మొత్తం మహిళలపై వారికున్నా చులకన భావాన్ని తెలియజేస్తుందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిని మహిళలంతా గమనిస్తున్నారనీ.. రాబోయే కాలంలో వారికి సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Next Story