వాయుగుండం ఎఫెక్ట్‌.. నేడు పలు చోట్ల భారీ వర్షాలు

Telangana and AP will receive heavy rains. తెలంగాణలో నేడు పలు చోట్ల భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

By అంజి  Published on  15 Aug 2022 1:54 AM GMT
వాయుగుండం ఎఫెక్ట్‌.. నేడు పలు చోట్ల భారీ వర్షాలు

తెలంగాణలో నేడు పలు చోట్ల భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఉత్తర బంగా‌ళా‌ఖా‌తంలో ఆది‌వారం ఉదయం ఏర్పడిన వాయు‌గుండం.. పశ్చిమ బెంగా‌ల్-‌ఉ‌త్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీ‌కృ‌తమై ఉందని తెలిపింది. సోమ‌వారం వాయు‌గుండం తీరం దాటే అవ‌కాశం ఉన్నట్టు పేర్కొన్నది. దీనిప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండకపోయినప్పటికీ.. ఈ నెల 18 వరకు తేలి‌క‌పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని తెలి‌పింది. హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నది. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం సాయంత్రానికి తగ్గిపోయింది. అయితే సోమవారం ఉదయం నుంచి వాన ప్రారంభమైంది.

ఏపీలోనూ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో కూడా తీవ్ర వాయుగుండం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురువనున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో ఒకంట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.

Next Story
Share it