Telangana: రైతులకు శుభవార్త.. 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
తెలంగాణలో సన్న, చిన్నకారు, మహిళా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం 'వ్యవసాయ యాంత్రీకరణ' పథకాన్ని తిరిగి ప్రారంభించింది.
By - అంజి |
Telangana: రైతులకు శుభవార్త.. 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
తెలంగాణలో సన్న, చిన్నకారు, మహిళా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం 'వ్యవసాయ యాంత్రీకరణ' పథకాన్ని తిరిగి ప్రారంభించింది. దీని కింద లబ్ధిదారులకు 40 శాతం నుంచి 50 శాతం రాయితీతో ఆధునిక యంత్రాలను అందిస్తారు. సంక్రాంతి నుంచి ఈ స్కీమ్ అమలవుతోంది. దీని వల్ల 1.30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
ఈ పథకం కింద యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది. లబ్ధిదారుల కేటగిరీని బట్టి దీనిలో వాటా ఉంటుంది. సన్న, చిన్నకారు, మహిళా రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు యంత్రాన్ని కొనుగోలు చేస్తే ధరలో 50 శాతం వారు భరించాలి. మిగిలిన 50 శాతాన్ని ప్రభుత్వం రాయితీగా నేరుగా కంపెనీ ఖాతాలో జమ చేస్తుంది. ఇతర రైతులు యంత్రం ధరలో 60 శాతం వాటాను భరించాల్సి ఉంటుంది. 40 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది.
వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించి, యాంత్రీకరణను ప్రోత్సహించి అధిక దిగుబడులను సాధించడమే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ముఖ్య ఉద్దేశం. అందుకే రైతులు సాగులో ఎక్కువగా వినియోగించే ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, పవర్ టిల్లర్లు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలు, రోటావేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లను ప్రభుత్వం రాయితీగా అందించనుంది. దీని వల్ల పంట నాట్లు, కోత సమయంలో కూలీల కొరత, ఖర్చు తగ్గి రైతులకు ఎంతో లబ్ధి కలగనుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
రైతులు ఈ పథకం కోసం స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి లేదా వ్యవసాయాధికారిని సంప్రదించి దరకాస్తు తీసుకుని, తమకు కావలసిన యంత్రం వివరాలను నింపి ఇవ్వాలి. దానిని వారు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఎమ్మార్వో, ఎంపీడీవో, ఏవోలతో కూడిన మండల స్థాయి కమిటీ అర్జీలను పరిశీలించి జిల్లా అధికారులకు పంపుతుంది. వారి ఆమోదం తర్వాత యంత్రాలిచ్చే కంపెనీ పేరిట రైతులు తమ వాటా సొమ్మును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.