Telangana Elections: 700 మంది పోలీసు సిబ్బంది మార్పు.. 85 చెక్‌పోస్టుల ఏర్పాటు
తెలంగాణాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బుధవారం నాడు పోలీసు అధికారులకు నిర్వహించిన సమగ్ర ఒకరోజు శిక్షణా కార్యక్రమంతో సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
By అంజి Published on 31 Aug 2023 3:45 AM GMTTelangana Elections: 700 మంది పోలీసు సిబ్బంది మార్పు.. 85 చెక్‌పోస్టుల ఏర్పాటు
తెలంగాణాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆగస్టు 30, బుధవారం నాడు పోలీసు అధికారులకు నిర్వహించిన సమగ్ర ఒకరోజు శిక్షణా కార్యక్రమంతో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల ప్రక్రియను సజావుగా, సురక్షితమైనదిగా నిర్వహించడానికి కీలకమైన భద్రతా మాడ్యూల్స్‌పై వారి అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ఈ శిక్షణ జరిగింది. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా దాదాపు 700 మంది పోలీసు సిబ్బందిని మార్చినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో దాదాపు 80-85 చెక్‌పోస్టుల ఏర్పాటును ఆయన హైలైట్ చేశారు. క్లోజ్డ్-సర్క్యూట్ టీవీ కెమెరాలతో అనుసంధానించబడిన ఈ చెక్ పాయింట్‌లు భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఎన్నికల రోజున నగదు లేదా మద్యం అక్రమ రవాణా కోసం వాహనాల తనిఖీల నుండి పోలింగ్ స్టేషన్ల నిర్వహణ వరకు వివిధ భద్రతా సంబంధిత అంశాలపై డిజిపి అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు మంచి పద్ధతులు, పారదర్శకత పాటించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టుగా చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, డబ్బు, మద్యం వివరాల నమోదుకు కేంద్రం యాప్‌ను రూపొందించిందన్నారు. మద్యం, డబ్బు అక్రమ రవాణాపై పోలీసులు దృష్టి కేంద్రీకరించాలన్నారు.
పశ్చిమ బెంగాల్ సీఈఓ ఆరిజ్ అఫ్తాబ్ ఎన్నికల సన్నాహక పనులపై ప్రజేంటెషన్ ఇచ్చారు. పోలింగ్ బూత్‌ల వర్గీకరణ, అసెస్‌మెంట్‌ల గురించి ఆయన చర్చించారు. పోలీసు అధికారులకు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), ఇండక్షన్, డిప్లాయ్‌మెంట్, డి- ఇండక్షన్ గురించి తమిళనాడు సీఈఓ తిరు సత్యబ్రత సాహూ అవగాహన కల్పించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ), వ్యయ పర్యవేక్షణకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించే విధంగా సెషన్ నిర్వహించారు. అక్టోబర్ నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యల గురించి పరిశీలిస్తారు. ఈ పర్యటన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తేదీలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.