తెలంగాణ‌పై టీడీపీ ఫోక‌స్‌.. గ‌త‌ వైభ‌వ‌మే ల‌క్ష్యంగా బహిరంగ సభతో రంగంలోకి..

TDP focus on Telangana. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు

By M.S.R  Published on  27 Nov 2022 11:26 AM GMT
తెలంగాణ‌పై టీడీపీ ఫోక‌స్‌.. గ‌త‌ వైభ‌వ‌మే ల‌క్ష్యంగా బహిరంగ సభతో రంగంలోకి..

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలకంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ కు బాధ్యతలు అప్పగించగా.. తెలుగుదేశం పార్టీ మాజీ నేతలంతా మళ్లీ పార్టీలో చేరాలని కోరారు. టీడీపీ నుంచి వెళ్లి ఎక్కడ పనిచేస్తున్నా ఆత్మగౌరవంతో మళ్లీ పార్టీలో చేరాలని సూచించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందని.. యువతకు టికెట్లు ఇస్తామని చెబుతున్నారు.

తెలంగాణలో టీడీపీ మొద‌టి టార్గెట్ ఖమ్మం జిల్లా.. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌పై దృష్టిపెట్టనుంది. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ 15 స్థానాల్లో విజయం సాధించింది. ఎక్కువ భాగం గ్రేటర్ హైదరాబాద్ లోనే..! ఆ తర్వాత టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్‌తో కలిసి కూటమిగా బరిలో నిలిచిన టీడీపీకి ఘోర ఓటమి ఎదురైంది. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలోని రెండు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ తర్వాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అధికార టీఆర్ఎస్‌లో చేరిపోయారు.

తెలంగాణ టీడీపీకి అంతో ఇంతో పట్టు ఉన్న ఖమ్మం జిల్లాపై తొలుత దృష్టి సారించాలని నిర్ణయించారు. శనివారం ఎన్టీఆర్ భవన్‌లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నేతలతో కాసాని జ్ఞానేశ్వ‌ర్‌ సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 21న ఖమ్మంలో జరిగే టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పార్టీకి బలమైన క్యాడర్ ఉందని.. అక్కడి నుంచి పార్టీని పునరుద్దరించాలని చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారని చెప్పారు.



Next Story