Hyderabad: నకిలీ డాక్టర్ ఆటకు చెక్ పెట్టిన టాస్క్‌ఫోర్స్
నకిలీ డాక్టర్ల గురించి పేపర్లో చదువుతూ ఉంటాం అలాగే టీవీల్లో చూస్తూ ఉంటాం.. కానీ హైదరాబాద్ నగరంలో ఓ చిత్ర విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 9 Sept 2023 9:30 PM ISTHyderabad: నకిలీ డాక్టర్ ఆటకు చెక్ పెట్టిన టాస్క్‌ఫోర్స్
నకిలీ డాక్టర్ల గురించి పేపర్లో చదువుతూ ఉంటాం అలాగే టీవీల్లో చూస్తూ ఉంటాం.. కానీ హైదరాబాద్ నగరంలో ఓ చిత్ర విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి అసలు మెడిసిన్ గురించే తెలియదు.. చదువు లేదు.. అయినా కూడా డాక్టర్ అవతారం ఎత్తి ఏకంగా క్లినిక్ నడుపుతున్నాడు. ఈ నకిలీ డాక్టర్ గత కొన్ని సంవత్సరాలుగా అమాయకమైన జనాలను మోసం చేస్తూ వారికి మందులు ఇస్తూ దర్జాగా లాభాలు పొందుతున్నాడు. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందానికి విశ్వసనీయమైన సమాచారం రావడంతో షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్లినిక్ నడుపుతున్న నకిలీ డాక్టర్‌ని పట్టుకున్నారు.
డంగూర్ ప్రదీప్ జై (45) హైదరాబాదులోని బేగంబజార్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. ఇతను ఆయుర్వేద డఅభ్యాసకుల వద్ద పనిచేసేటప్పుడు ఆయుర్వేద, జనరల్ మెడిసిన్ పై కొంత జ్ఞానం సంపాదించాడు. అనంతరం ఇతనికి డబ్బు ఆశ పుట్టింది. సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకొని డాక్టర్ అవతారం ఎత్తాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవు ప్రదీప్ 1999లో నకిలీ D.A.M.S&M.D(A) బిరాజ్ మెడికల్ కాలేజ్ ఆఫ్ అలోపతి కి చెందిన డాక్టర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ పత్రాలను సేకరించాడు. అనంతరం ఒక ఏజెంట్ ద్వారా న్యూఢిల్లీకి చెందిన ఆయుర్వేద ఆచార్య నుండి B.A.M.S పత్రాలను సేకరించాడు. అనంతరం నిందితుడు ప్రదీప్ హైదరాబాదులోని జమ్మేరాత్ బజారు రోడ్డులో శ్రీ నామన్ క్లినిక్ పేరుతో క్లినిక్ ప్రారంభించి B.A.M.S,MD జనరల్ ఫిజీషియన్‌గా చెప్పుకుంటూ నకిలీ డాక్టర్‌గా చెలమణీ అవుతున్నాడు.
ఈ విధంగా డాక్టర్ అమాయకమైన జనాలకు సాధారణ వ్యాధుల చికిత్సకు మందులు ఇస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇతనికి మెడిసిన్ ఉపయోగం గురించి అసలు తెలియదు. అయినా కూడా జనాలకు ఆయుర్వేద చికిత్స పేరుతో రకరకాల మందులు ఇచ్చేవాడు. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందానికి పక్కా సమాచారం రావడంతో ఈ నకిలీ డాక్టర్ ఆటకు ముగింపు కార్డు ఇచ్చారు. నకిలీ డాక్టర్ అయిన ప్రదీప్ అరెస్టు చేసి అతని వద్ద నుండి నకిలీ సర్టిఫికెట్, రబ్బర్ స్టాంపులు, విసిటింగ్ కార్డులు, స్టెతస్కోప్, ఆప్రాన్ బీపీ చెకింగ్ మిషన్, వివిధ రకాలైన మందులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అరెస్టు చేసిన నిందితుడిని షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.