కొందరు వ్యక్తులు తనకు ఫోన్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారని తాండూరు టీఆర్‌ఎస్(బీఆర్‌ఎస్) శాసనసభ్యుడు పైలట్ రోహిత్‌రెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ల నుంచి తనకు వేర్వేరు నంబర్‌ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే మాదాపూర్ ఏసీపీ సీహెచ్ రఘునందన్‌రావుకు ఫిర్యాదు చేశారు. కాల్ చేసినవారు అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతున్నారని, నన్ను ఎలిమినేట్ చేస్తామని బెదిరిస్తున్నారని రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలావుంటే.. ముగ్గురు వ్యక్తులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజి స్వామి – తనతో పాటు మరో ముగ్గురు టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని హామీ ఇచ్చి బీజేపీలోకి లాక్కునేందుకు ప్రయత్నించారని పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించారు. కాంట్రాక్టులు, పార్టీలో ప్రముఖ స్థానాలు ఇస్తామని చెప్పినట్లు రోహిత్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి స్వామిని అరెస్ట్ చేశారు.