తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. తొలుత కొత్త సర్పంచ్ లు ఈ నెల 20న బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఆ రోజు ముహూర్తం బాగాలేదని కొత్త సర్పంచ్ లు విజ్ఞప్తి చేయడంతో ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల 22కు మార్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 22న నూతన సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది.
ముగిసిన మూడో విడత పోలింగ్..
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తంగా 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు పోలింగ్ పూర్తయింది. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రానికి ఫలితాలు వెలువడనున్నాయి. తుది విడతలో సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.