బీజేపీకి స్వామి గౌడ్ రాజీనామా

Swamy Goud Resigns For BJP. బీజేపీకి ఆ పార్టీ సీనియర్ నేత స్వామి గౌడ్ రాజీనామా చేశారు.

By Medi Samrat  Published on  21 Oct 2022 3:35 PM IST
బీజేపీకి స్వామి గౌడ్ రాజీనామా

బీజేపీకి ఆ పార్టీ సీనియర్ నేత స్వామి గౌడ్ రాజీనామా చేశారు. ఈ విషయమై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు లేఖ రాశారు. అనేక ఆకాంక్షలతో బీజేపీలో చేరినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో, గౌరవించడంలో మీరు అనుసరిస్తున్న తీరు నా మనసును చాలా గాయపరిచిందంటూ స్వామి గౌడ్ లేఖలో పేర్కొన్నారు.

పార్టీలో ఉన్న ధనవంతులకు, బడా కాంట్రాక్టర్లకు ప్రాతినిధ్యం పెంచుతూ.. నిబద్దతతో, నిజాయితీగా ప్రజా సమస్యల పట్ల నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తల పట్ల నాయకుల పట్ల మీరు అనుసరిస్తున్న తీరు అక్షేపనీయమంటూ లేఖలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఎదిగిన మీరు.. బలహీన వర్గాల ఉన్నతికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా.. ఇతరులు చెప్పినట్టు నడుచుకోవడం వల్ల.. నాలాంటి ఎందరో నాయకులు అనేక అవమానాలకు గురవుతున్నారు. పార్టీలో అవమానాలను భరిస్తూ కొనసాగలేకపోతున్నాను. కలత చెందిన మనసుతో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. పార్టీలో ఇంతకాలం మీరు అందించిన సహకారానికి ధన్యవాదాలు అంటూ స్వామి గౌడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో స్వామిగౌడ్ సమావేశమైనట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న బీజేపీని వీడిన నేప‌థ్యంలో బీఆర్ఎస్ జెండా క‌ప్పుకోనున్నార‌నే ఊహాగానాలు జోరందుకున్నాయి.


Next Story