ఎప్పుడైనా.. ఏదైనా తగలబడింది అంటే పొరపాటున జరిగింది అని అనుకోవచ్చు. కానీ ఆ ఊర్లో ప్రతి రోజూ ఏదో ఒకటి తగలబడుతూ ఉండడంతో జనంలో కొంచెమైనా భయం మొదలవుతుంది. అలా నల్గొండ జిల్లాలో ఎవరూ ఊహించని విధంగా మంటలు చెలరేగుతూ ఉన్నాయి.ప్రతీ రోజూ ఎవరో ఒకరి ఇంట్లో దుస్తులు, పశువుల కొట్టం, గడ్డి వాము ఇలా ఏదో ఒకటి అగ్నికి ఆహుతి అవుతోంది. ఒకటి కాదూ.. రెండు కాదు.. ఏకంగా 22 రోజులుగా ఇదే విధంగా జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సమయంలో ఎవరో ఒకరి ఇంట్లో కాలిన ఘటన చోటు చేసుకుంటూ ఉంది.
నల్లగొండ జిల్లా చందంపేట మండలం మురుపు నూతల గ్రామ పంచాయతీ పరిధిలోని పాత ఊరి తండాలో ఇప్పుడు మంటల టెన్షన్ మొదలైంది. పాత ఊరి తండాలో గత 22 రోజులుగా ఎవరో ఒకరి ఇంట్లో అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంది. అంతుచిక్కని కారణాలతో రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరో ఒకరి ఇంట్లో ఏదో ఒక ఘటన చోటు చేసుకుంది. ఈ వింత ఘటనతో గ్రామ ప్రజలను హడలెత్తిపోతున్నారు. అసలేం జరుగుతోందని తెలుసుకునేందుకు ఊరంతా ఏకమై కనిపెట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మంత్రగాళ్ళతో ప్రత్యేక పూజలు చేయించినా అది కూడా విఫలమైంది. పోలీసులు కాపలా ఉన్నారు. కానీ కనిపెట్టలేకపోయారు. తాళం వేసిన ఇంట్లో కూడా దస్తులు తగలబడ్డంతో జనమంతా ఏమి జరుగుతుందో తెలియక జుట్టు పట్టుకుని పీక్కుంటూ ఉన్నారు. మిస్టరీ ఎప్పుడు వీడుతుందో ఏమో అని చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.