సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
By అంజి Published on 29 Aug 2024 5:15 PM ISTసీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అత్యున్నత న్యాయస్థానంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం ప్రకటనను సుప్రీంకోర్టు విమర్శించింది. ఓ ముఖ్యమంత్రి ఆ విధంగా ఎలా మాట్లాడుతారని వ్యాఖ్యానించింది. ఎవరూ విమర్శించినా తాము పట్టించుకోమని, తమ మనస్సాక్షి ప్రకారం విధులు నిర్వహిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జగదీష్‌రెడ్డి తరఫు న్యాయవాది రేవంత్ వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ''మేం రాజకీయ పార్టీలతో చర్చించి ఆర్డర్ ఇవ్వాలా? ఓ సీఎం అలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగలరు?'' అని మండిపడింది.
బీఆర్‌ఎస్ పార్టీ తమ ఓటు బ్యాంకును బీజేపీకి బదిలీ చేసిందని, ఆ కారణంగానే కవితకు ఐదు నెలల్లో బెయిల్ వచ్చిందని సీఎం రేవంత్ మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో సిసోడియాకు బెయిల్ ఎందుకు ఆలస్యం అయ్యిందని, నెలలు గడుస్తున్నా సీఎం కేజ్రీవాల్‌కు ఎందుకు బెయిల్ రావడం లేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు.