నష్టం పూడ్చే చర్యలు లేకపోతే జైలుకే..కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.
By Knakam Karthik
నష్టం పూడ్చే చర్యలు లేకపోతే జైలుకే..కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. కంచ గచ్చిబౌలి భూముల్లో భారీగా చెట్లు నరికివేయడంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? లేదా? అనేది స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు చర్యలు మొదలు పెట్టారని ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను స్పష్టంగా చెప్పాలంది.
కేంద్ర సాధికార సంస్థ దాఖలు చేసిన నివేదికపై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సమయం కోరారు. మీరు జులైలో విచారణ పెట్టమంటున్నారు. చెట్లు నరకబడిన ప్రాంతంలో పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికను చేపట్టింది? ఏమీ లేదు? కదా అని ప్రశ్నించింది. పర్యావరణానికి జరిగే నష్టాన్ని పూడ్చే చర్యలు చేపట్టకపోతే సీఎస్ సహా కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా విజిల్ బ్లోయర్స్, విద్యార్థులపై కేసుల విషయాన్ని పలువురు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ కేసులు కొట్టివేయాలని అప్లికేషన్ దాఖలు చేసినట్లు తెలపగా.. ఈ పిటిషన్‌తో కలిపి విచారించడం కుదరదని సీజేఐ స్పష్టం చేశారు. కావాలనుకుంటే వేరే పిటిషన్ దాఖలు చేసుకోవచ్చన్నారు.
అభివృద్ధికి మేమెప్పుడూ మద్దతుదారులం. కానీ దీర్ఘ సెలవులను ఉపయోగించుకుని పెద్ద ఎత్తున చెట్లు నరికివేసిన ఘటనను మేం చూస్తున్నాం. వన రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు..అని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా తదుపరి విచారణణకు జులై 23కి వాయిదా వేసింది.