చరిత్రలోనే తొలిసారిగా అంగన్వాడీ చిన్నారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అంగన్వాడీ చిన్నారులకు నెల రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. తల్లిదండ్రులు, అంగన్వాడీ యూనియన్ల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో బుధవారం అంగన్వాడీ యూనియన్లతో డైరెక్టర్ కాంతి వెస్లీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు వేసవి సెలవులపై చర్చించారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో మే 1 నుంచి సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ సెలవుల్లో అంగన్వాడీ లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంగన్వాడీ చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు టేక్ హోం రేషన్ ద్వారా గుడ్లు, సరుకుల సరఫరా చేయాలని సూచించారు. సెలవుల కాలంలో అంగన్వాడీ టీచర్లకు ఇతర విధులు అప్పగిస్తామని తెలిపారు. కాగా ఈ సెలవు కాలంలో ఇంటింటి సర్వే, హోం విసిట్స్, అంగన్వాడీలో చేర్చే చిన్నారుల గుర్తింపు వంటి విధులను నిర్వర్తించాలని టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో వేసవి నుంచి లబ్ధిదారులకు, సిబ్బందికి ఉపశమనం కలిగినట్లయింది.