భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం..స్థంభించిన జనజీవనం
తెలంగాణ రాజధాని భాగ్యనగరాన్ని జడివాన ముంచెత్తింది.
By Knakam Karthik
భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం..స్థంభించిన జనజీవనం
తెలంగాణ రాజధాని భాగ్యనగరాన్ని జడివాన ముంచెత్తింది. గురువారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. గంట వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో రోడ్లన్నీ నదులను తలపించాయి. ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అధికారులు నగరవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేశారు.
ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఐటీ ఉద్యోగులు నాలుగు నుంచి ఐదు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడ్డారు. పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరగా, కొన్నిచోట్ల ద్విచక్ర వాహనాలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి.
హిమాయత్‌సాగర్ గేట్లు ఓపెన్
మరోవైపు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1762.70 అడుగులకు చేరింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు గురువారం రాత్రి ఒక గేటును ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.