ఆ విషయంలో టీఆర్‌ఎస్‌తో పోటీ ప‌డండి.. బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్‌ సవాల్

Stop hate politics, compete with us in development. విద్వేషపూరిత రాజకీయాలు మానుకోవాలని, అభివృద్ధి విషయంలో టీఆర్‌ఎస్‌తో పోటీ పడాలని

By Medi Samrat  Published on  29 Jan 2022 1:18 PM GMT
ఆ విషయంలో టీఆర్‌ఎస్‌తో పోటీ ప‌డండి.. బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్‌ సవాల్

విద్వేషపూరిత రాజకీయాలు మానుకోవాలని, అభివృద్ధి విషయంలో టీఆర్‌ఎస్‌తో పోటీ పడాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌టం, అభివృద్ధిని అడ్డుకోవడం రాజకీయం కాదని.. అది రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు చేయదన్నారు. శనివారం బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్‌ అనంతరం జరిగిన సభలో ప్రసంగిస్తూ.. దేశానికి ఆర్థికంగా దోహదపడే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగో అతిపెద్ద రాష్ట్రంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిందని గుర్తు చేశారు.

కానీ దురదృష్టవశాత్తూ.. అటువంటి చైతన్యవంతమైన రాష్ట్రానికి మద్దతు ఇవ్వడం.. నిధులు ఇవ్వడం కంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మా పట్ల వివక్ష చూపుతోందని ఆయన అన్నారు. 2020 అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమైంది. అనేక కాలనీలు జలమయమయ్యాయి. దెబ్బతిన్న నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు వరద సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని కోరినప్పటికీ 16-17 నెలలు గడిచినా స్పందన లేదని మంత్రి అన్నారు. గుజరాత్‌లో వరదలు వచ్చినప్పుడు మాత్రం ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాని అక్కడికి చేరుకున్నారని.. వెంటనే రూ.1000 కోట్ల వరద సాయం మంజూరు చేశారని అన్నారు.

గత ఏడేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 ఐఐటీలు, 7 ఐఐఎంలు, 2 ఐఐఎస్‌ఈఆర్‌లు, 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందని.. అయితే తెలంగాణకు నవోదయ విద్యాలయాలు సహా ఒక్కటి కూడా మంజూరు చేయలేదని కేటీఆర్ అన్నారు. అధికారం ప్రజలే ఇస్తారు. ఎవ‌రూ శాశ్వతం కాదు, అధికారంలో ఉన్నవారు వారి కోసం ఏమి చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు ఏం చేశారో వివరించాలని బీజేపీ నాయకత్వాన్ని మంత్రి డిమాండ్ చేశారు.

బడంగపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కరోజే రూ.371 కోట్లతో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిందని.. బడంగపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మంజూరు చేసిందో బీజేపీ నేతలకు దమ్ముంటే వివరించాలన్నారు. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.371 కోట్లు ఖర్చు చేస్తున్నాం.. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ అబివృద్ధికి రూ.1,000 కోట్లు మంజూరు చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ధైర్యంగా చెబుతున్నాను. తెలంగాణలో రూ.2వేలు పింఛన్ ఇస్తున్నామని.. బీజేపీ పాలిత గుజరాత్‌లో ఇప్పటికీ రూ.500 పింఛన్ ఇస్తున్నార‌ని .. మీకు చేతనైతే తెలంగాణకు రూ.2వేల పెన్షన్ అదనంగా ఇప్పించండని సవాల్ విసిరారు. మత, విభజన, విద్వేషపూరిత రాజకీయాలతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఎవరూ ఆపలేరని కేటీఆర్ అన్నారు.


Next Story