తెలంగాణలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌ఏ విద్యార్థులకు వర్సిటీ రిజిస్ట్రార్ శుభవార్త చెప్పారు. పీజీ, పీహెచ్‌ఏ స్టూడెంట్స్‌కు స్టైఫండ్ పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీ కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్స్ పొందిన తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకు, ఇతర స్కాలర్‌షిప్ లేదా ఫెలోషిప్ అందని వారికి ఈ నెల ఒకటో తేదీ నుంచి పెంపుదల వర్తిస్తుందని చెప్పారు. ప్రస్తుతం 20 నెలల పరిమితితో సాగుతున్న పీజీ కోర్సుల్లో విద్యార్థులకు ప్రతినెలా రూ.5 వేలు చెల్లిస్తున్నారు. కోర్సులను 24 నెలలకు పొడిగిస్తూ ప్రతినెలా రూ.12 వేల చొప్పున చెల్లిస్తామని వెల్లడించారు. 25 నెలల పరిమితి ఉన్న పీహెచ్ఎ కోర్సులో విద్యార్థులకు నెలకు రూ.7 వేలు ఇస్తుండగా.. ఇకపై దానిని 36 నెలలకు పెంచి ప్రతినెలా రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పారు. ప్రతినెలా 10వ తేదీలోపు విద్యార్థులకు స్టైపెండ్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.