తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్..ఆ పన్ను రద్దు!
తెలంగాణలో వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది
By - Knakam Karthik |
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్..ఆ పన్ను రద్దు!
తెలంగాణలో వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండో వాహనం కొనుగోలు చేసేవారికి విధిస్తున్న 2 శాతం అదనపు లైఫ్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రవాణా శాఖ పంపిన ప్రతిపాదనకు సీఎం రేవంత్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో రెండో వాహనం కొనేవారు అదనంగా 2 శాతం పన్ను చెల్లిస్తున్నారు. ఉదాహరణకు రూ.1.20 లక్షల విలువైన బైక్‌ను రెండో వాహనంగా కొంటే రూ.2,400 అదనంగా కట్టాల్సి వస్తోంది. ఈ విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ మొత్తం ఆదాయం తగ్గినా, ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుంది.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'వాహన్'లో చేరాలని నిర్ణయించింది. ఈ పోర్టల్‌లో ఒక వ్యక్తికి ఇదివరకే వాహనం ఉందో లేదో గుర్తించేందుకు ప్రత్యేక ఆప్షన్ లేదు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఈ అదనపు పన్నును రద్దు చేయడమే సరైన మార్గమని రవాణా శాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ ప్రతిపాదనకు సీఎం అంగీకరించడంతో వాహనదారులకు త్వరలోనే శుభవార్త అందనుంది.