సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయకూడదట..!
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది.
By Medi Samrat Published on 28 Nov 2023 2:59 PM GMTతెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. అయితే సోషల్ మీడియాలో కూడా ఎన్నికల ప్రచారం చేయవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. అనుమతి పొందిన ప్రకటనలకు మాత్రమే ప్రింట్ మీడియాలో అవకాశముందన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వాటిని ప్రదర్శించవద్దని.. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్ వర్క్‌లలో ఎన్నికల ప్రచారం చేయవద్దన్నారు. ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదని స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసిన అర్ధగంట వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించవద్దని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న దాదాపు లక్షన్నర మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినట్లు వెల్లడించారు. 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో 7,571 ప్రాంతాల్లో బయట కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రంలోకి గుర్తింపు కార్డు తప్ప సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకు వెళ్లరాదని తెలిపారు.
తెలంగాణలో సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ప్రచారాలకు వేరే నియోజకవర్గాల నుంచి వచ్చిన వారు స్థానికంగా ఉండకూడదని అధికారులు తెలిపారు. దీంతో ఇతర ప్రాంతాల వారు అక్కడి నుంచి వెళ్లిపోవాలి. రేపు, ఎల్లుండి ఎన్నికలకు సంబంధించి రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు.