తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి.. రానున్న ప్రముఖులు వీరే
Stalin, Soren, Prakash Ambedkar & others to attend Telangana Secretariat launch on Feb 17. హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 17న ఉదయం 11.30 గంటల
By అంజి Published on 24 Jan 2023 2:43 PM IST
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 17న ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి ముందు వేద పండితులు వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం, ఇతర పూజలను, ఆచారాలను నిర్వహిస్తారు. ప్రారంభ వేడుకల్లో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తరపున జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్, డాక్టర్ బీఆర్. అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు.
అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖులందరూ బహిరంగ సభలో ప్రసంగిస్తారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలో భారీ బీఆర్‌ఎస్ సమావేశం జరిగిన వారం రోజులకే కేసీఆర్ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ ప్రతిపక్ష నేతలను సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారని మంత్రి వేముల తెలిపారు.
హుస్సేన్ సాగర్ లేక్ సమీపంలో ఏర్పాటు చేసిన ఏడంతస్తుల సచివాలయ భవన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. 7 లక్షల చదరపు అడుగులకు పైగా నిర్మాణ విస్తీర్ణం, అన్ని ఆధునిక సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించేందుకు రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. జూన్ 27, 2019న కొత్త సచివాలయ సముదాయానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులతో పాటు కోవిడ్ -19 మహమ్మారి కారణంగా పనిని నిలిపివేశారు. ప్రతిపక్ష పార్టీలు, కార్యకర్తలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసిన తరువాత, డిసెంబర్ 2020 లో నిర్మాణం ప్రారంభించబడింది. రెండేళ్లలో పూర్తయింది.