'సిట్' నోటీసులకు భ‌యపడేది లేదు : రేవంత్ రెడ్డి

Special Investigation Team Notice to Revanth Reddy. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజీ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్

By Medi Samrat  Published on  20 March 2023 5:36 PM IST
సిట్ నోటీసులకు భ‌యపడేది లేదు : రేవంత్ రెడ్డి

Revanth Reddy


తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజీ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారిస్తున్న విష‌యం తెలిసిందే. పేపర్ లీకేజీ వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సోమ‌వారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్‌ నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీలో ఐటీ మంత్రి కె.టి.రామారావు వ్యక్తిగత సహాయకుడు తిరుపతి హస్తం కూడా ఉందని, గత ఏడాది అక్టోబర్‌లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో తమ గ్రామంలో వందల మంది అభ్యర్థులు వందకు పైగా మార్కులు తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేపర్ లీకేజీకి సంబంధించిన సమాచారం, ఆధారాలు తెలియజేయాల్సిందిగా రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. రేవంత్‌ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు అందజేయాల‌ని నోటీసుల‌లో కోరారు. ఇతర రాజకీయ నాయకులకు కూడా ఇదే తరహాలో నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

అయితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ విష‌య‌మై స్పందిస్తూ.. సిట్ నోటీసులు నాకు ఇంకా అందలేదని తెలిపారు. సిట్ నోటీసులకు భ‌యపడేది లేదని పేర్కొన్నారు. మా దగ్గర ఉన్న ఆధారాలను సిట్ కు ఇవ్వమ‌న్న రేవంత్‌.. సిట్టింగ్ జడ్జితోనే విచారణ చేపించండి.. అప్పుడే ఇస్తామ‌న్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా ఉంటామ‌ని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ బాగోతం బయటపడాలంటే.. సిట్టింగ్ జడ్జ్ తోనే విచారణ జరిపించాలని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ గద్దె దిగేదాక మా పోరాటం కొనసాగుతుంద‌ని.. కేసును కావాలనే నీరుగారుస్తున్నారని రేవంత్ ఆరోపించారు.


Next Story