మేడారం మహా జాతరకు సంబంధించిన పనులు వేగం అందుకున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, లాభనష్టాలతో సంబంధం లేకుండా మెరుగైన సేవలు అందించాని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారుకుల సూచించారు. మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ఏర్పాట్లపై సోమవారం నాడు ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 13 నుండి 20వ తేదీ వరకు బస్సులు నడవనున్నాయి. జాతర కోసం 3,845 బస్సులు నడపాలని నిర్ణయించామని పువ్వాడ తెలిపారు. మేడారంలో బస్సు ప్రాంగణంను 50 ఎకరాల విస్తీర్ణంలోల ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డితో పాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, కరీంగనర్ నుండి బస్సులు నడవనున్నాయి. మెరుగైన వసతి సదుపాయంతో పాటు సిబ్బందికి మంచి ఆహారాన్ని అందించనున్నారు. కరోనా బూస్టర్ డోస్ వేయించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, శానిటైజర్లు, మాస్కులు ఇవ్వడంతో పాటు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని మంత్రి పువ్వాడ అధికారులకు సూచించారు. బస్సు బయలుదేరే ముందు శుభ్రం చేయాలన్నారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఆర్టీసీ, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. మేడారం జాతరకు సేవలు అందించేందుకు 12,150 మంది సిబ్బందిని కేటాయిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.