తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ నిలిపివేత
Slot bookings for registration of non-agricultural properties in Telangana halted again. తెలంగాణ ప్రభుత్వం కీలక
By Medi Samrat Published on 19 Dec 2020 6:59 AM GMT
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్‌లను నిలిపివేసింది. అయితే.. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి యథావిథిగా రిజిస్ట్రేషన్ల సర్వీసులు అందించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ, కొత్తగా స్లాట్ బుకింగ్ ఉండదని స్పష్టం చేసింది. తదుపరి స్లాట్ బుకింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు రెండు రోజుల్లో తెలియచేస్తామన్నారు.
ధరణి పోర్టల్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్లు సాఫీగా సాగడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదానిపై సాంకేతిక నిపుణలతోనూ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఆదేశాలతో అనుసరించాల్సిన వ్యూహాలపై సర్కార్ దృష్టిపెట్టింది.
రిజిస్ట్రేషన్లపై ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. క్యాంప్ ఆఫీస్‌లో జరిగే ఈ రివ్యూకు.. సీఎస్‌తో పాటు రెవెన్యూ అధికారులు హాజరు కానున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు చేసిన కామెంట్లపై పూర్తిస్థాయిలో అధికారులతో చర్చించనున్నారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లడమా లేదంటే తీర్పుకు అనుగుణంగా విధివిధానాలు మార్చి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా అనే అంశంపై రెవెన్యూ, న్యాయశాఖ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.