అన్నిసబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రమంతా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
By అంజి
అన్నిసబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రమంతా అమలు చేస్తామని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార మరియు పౌరసంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెండు విడతల్లో 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేసిన విధానం విజయవంతం అయ్యిందన్నారు. ఇప్పటికే 36 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పారు.
ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు. రిజిస్ట్రేషన్ల కోసం గంటలకొద్దీ వెయిట్ చేయకుండా, దళారుల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా స్లాట్ బుకింగ్ సేవలను అమలు చేయగా, అది విజయవంతం కావడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త అమలుకు సిద్ధమైంది. ఇంటి నుంచే registration.telangana.gov.in లో స్లాట్ బుక్ చేసుకుని వెళ్తే 10 నుంచి 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
ఆస్తుల క్రయ విక్రయదారులకు పారదర్శకంగా అవినీతి రహితంగా సమయం ఆదా అయ్యేలా మెరుగైన సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా మొదటి దశలో ఏప్రిల్ 10వ తేదీన 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఇక్కడ మంచి ఫలితాలు రావడంతో ఈనెల 12వ తేదీ నుంచి 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ రెండు విడతలు కలిపి 47 చోట్ల అమలు చేసిన విధానం విజయవంతమైందని, ప్రజల నుంచి అనూహ్యస్పందన లభించిందని 94 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని ఈ రెండు విడతల్లో కలిపి దాదాపు 36 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని మంత్రి పొంగులేటి తెలిపారు.
అదనపు సిబ్బంది నియామకం
స్లాట్ బుకింగ్ విధానం దృష్ట్యా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్ధీకరణ చేస్తున్నామని పని భారం అధికంగా ఉన్న పఠాన్‌చెరువు, యాదగిరి గుట్ట, గండిపేట, ఇబ్రహీం పట్నం , సూర్యాపేట, జడ్చర్ల ,మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్ మొత్తం తొమ్మిది చోట్ల అదనపు సబ్ రిజిస్ట్రార్‌తోపాటు సిబ్బందిని నియమిస్తున్నామని తెలిపారు.
ప్రత్యేక పోర్టల్
నిషేధిత జాబితాలోని ఆస్దులను ఎట్టి పరిస్దితుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని భూ భారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను ఏర్పాటు చేశామని నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపరచడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడైనా నిషేధిత జాబితాలోని భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే క్షణాల్లోహైదరాబాద్ లోని స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయంలో ఆన్‌లైన్ లో తెలిసిపోయేలా వ్యవస్ధను ఏర్పాటు చేశామన్నారు.
ఎక్కడైనా నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.