SLBC TUNNEL: సవాల్ విసురుతున్న బురద నీరు.. ఇంకా లభించని ఆ 8 మంది ఆచూకీ
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ప్రమాదం జరిగి సుమారు 48 గంటలు అవుతోంది. అయినా సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు.
By అంజి
SLBC TUNNEL: సవాల్ విసురుతున్న బురద నీరు.. ఇంకా లభించని ఆ 8 మంది ఆచూకీ
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ప్రమాదం జరిగి సుమారు 48 గంటలు అవుతోంది. అయినా సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. కార్మికుల ఆచూకీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రెస్క్యూ బృందాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పెద్ద ఎత్తున చేరుకుంటున్న నీటిని తోడివేయటం సమస్యగా మారటంతో పాటు మట్టి, బురదను తొలగించడం రెస్య్కూ బృందాలకు సవాల్ విసురుతోంది. భారత సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనగా ఎయిర్‌ఫోర్స్, విశాఖపట్నం నుంచి నేవీ బృందాలు మూడు హెలికాప్టర్‌లలో అక్కడికి చేరుకున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావాలన్న లక్ష్యంతో శ్రమిస్తున్నారు.
అటు ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను దగ్గరుండీ పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి పలుమార్లు మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు రెండోరోజు నిర్విరామంగా కొనసాగిన సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్, జూపల్లి దగ్గరుండీ పర్యవేక్షించారు.
సహాయక చర్యల్లో ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేవీ కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏజెన్సీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని, ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలొద్దని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.
సొరంగంలో వస్తున్న నీరు సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని, నిరంతరం నీటిని బయటకు తోడేయటంతో పాటు సొరంగంలోనికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. టన్నెల్‌లో కూలిన మట్టి దిబ్బలను తొలగించి ప్రమాదం జరిగిన చోటికి చేరుకునే ప్రత్నామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.