తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచే 6,7,8 విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తరగతులు ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. 6,7,8 తరగతులను రేపటి నుంచి మార్చి 1వ తేదీ లోగా ప్రారంభించుకోవచ్చునని తెలిపారు. అయితే.. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
విద్యార్థులను పాఠశాలకు పంపే విషయంలో మాత్రం తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అతలాకుతలం అయింది. ఈ విద్యాసంవత్సరం కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పారు. అయితే.. కరోనా వ్యాక్సిన్ రావడం, ఈ మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలను పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నాయి.