పది రోజుల్లోనే 50 వేల బుకింగ్‌లు.. భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన!

Sitarama Kalyanotsava Talambralu. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

By Medi Samrat  Published on  28 March 2023 7:15 PM IST
పది రోజుల్లోనే 50 వేల బుకింగ్‌లు.. భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన!

భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. కేవలం పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్‌ చేసుకున్నారు. రోజుకు సగటున 5 వేల వరకు బుకింగ్‌లు అవుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. రూ.116 చెల్లించి బుక్‌ చేసుకుంటే కల్యాణం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోండెలివరీ చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తలంబ్రాల బుకింగ్‌ జరుగుతోంది.

భక్తులకు మరో అవకాశాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. శ్రీరామ నవమి కల్యాణ సమయంలోనే కాకుండా.. తలంబ్రాలను ఎప్పుడైనా భక్తులు పొందే సదావకాశాన్ని కల్పించింది. కార్గో పార్శిల్‌ సెంటర్‌కు వెళ్లి రూ.116 చెల్లిస్తే నిర్ణీత సమయంలో తలంబ్రాలను భక్తులకు అందించనుంది.

భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఒక్క తెలంగాణ నుంచే కాకుండా విదేశాల నుంచి బుకింగ్‌లు వస్తున్నాయి. దుబాయ్‌, అమెరికా, తదితర దేశాల నుంచి కాల్‌ చేసి తలంబ్రాలు కావాలని అడుగుతున్నారు. కేవలం 10 రోజుల్లోనే 50 వేల బుకింగ్‌లు వచ్చాయి. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఆ తలంబ్రాలను భక్తులు పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నారని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్‌ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని సూచించారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగ ఫోన్‌ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించాలన్నారు. తమ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారని తెలిపారు.


Next Story