ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ ముమ్మరం చేసిన సిట్ అధికారులు మరో ఐదుగురికి నోటీసులు జారీ చేశారు. కేరళ వైద్యుడు జగ్గుస్వామి సోదరుడు మణిలాల్‌తో పాటు సిబ్బంది శరత్, ప్రశాంత్, విమల్, ప్రతాపన్‌లకు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని, ఈసారి కూడా విచారణకు హాజరుకాకపోతే 41-ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని సిట్ పేర్కొంది. ఈ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు.
దీంతో నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలకు వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. కాగా, నందకుమార్ భార్య చిత్ర లేఖ, న్యాయవాదులు ప్రతాప్ గౌడ్, శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే అరెస్టయిన నిందితులతో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రతాప్ గౌడ్, నందకుమార్ బ్యాంకు ఖాతాలపై విచారణ చేస్తున్నారు.