తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) పరీక్ష పేపర్ లీక్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల క్రితం జరిగిన టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్‌లో అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి చెందిన పలువురు నేతల ప్రమేయం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఒకే ఊర్లో ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చాయని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల క్రమంలో ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది. కేసు గురించి అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని సమర్పించాలని కోరింది. మార్చి 24న సిట్ ముందు హాజరుకావాలని కోరింది. ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బీఆర్‌ఎస్ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని గతంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో పేర్కొన్న నేపథ్యంలో ఆయనకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది.