ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ ప్రారంభమైంది. కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు భారీగా సభకు హాజరయ్యారు. మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇదిలావుంటే.. సభకు హాజరయ్యేందుకు ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన నిర్బంధపూరితంగా నడుస్తోందని.. పతనం ప్రారంభమైందని అన్నారు.
తెలంగాణ సమాజంపై నిర్బంధాలే పతనానికి నాంది అని పేర్కొన్నారు. ప్రజలు చైతన్యవంతులై ఇలాంటి నిర్బంధాలను ఛేదించుకుని బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఉపా కేసులు ఉన్నప్పటికీ తాను పాడటం మానేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో యుద్ధం మొదలైందని, ప్రజాస్వామిక పద్ధతిలో ఆ యుద్ధాన్ని ఓట్ల రూపంలోకి మలిచేందుకు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని గద్దర్ సూచించారు. సీఎం కేసీఆర్ విధానాలను విమర్శిస్తూ గద్దరు పాట పాడారు. తాను కోరుకుంటే కాంగ్రెస్ లో చేరగలననని.. కానీ ఇప్పటికే తాను గద్దర్ ప్రజా పార్టీ పేరిట ఓ పార్టీ స్థాపించానని ఆయన వెల్లడించారు.