సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 26వ తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో.. అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ ను సీఎం ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సీఎం పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43,899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనున్నది.
రామగుండం నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి. సింగరేణి ప్రాంత సమస్యలు - పరిష్కారాలు అంశంపై ఆ ప్రాంత పరిధిలోని ప్రజా ప్రతినిధులతో ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శ్రీ బాల్క సుమన్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తదితరులు పాల్గొన్నారు.