సింగరేణి ఎన్నికలపై యూటర్న్.. బరిలోకి టీబీజీకేఎస్

సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  23 Dec 2023 7:12 AM IST
singareni elections, telangana, brs, tbgks, kavitha,

సింగరేణి ఎన్నికలపై యూటర్న్.. బరిలోకి టీబీజీకేఎస్

సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ముందుగా సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ చేస్తుందని ఆ సంఘం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్ సింగరేణిని కాపాడారని చెప్పారు. 20వేల డిపెండెంట్‌ ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని చెప్పారు. టీబీజీకేఎస్‌ను గెలిపిస్తేనే కార్మికులకు న్యాయం జరుగుతుందనీ.. సింగరేణి ఎన్నికల్లో ఆత్మసాక్షిగా ఓటు వేసి టీబీజీకేఎస్‌ను గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.

కాగా.. డిసెంబర్‌ 27న సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా బీఆర్ఎస్‌ ఈ ఎన్నికల్లో దూరంగా ఉండాలని భావించింది. దాంతో.. దాని అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పోటీకి దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించారనీ తెలియడంతో.. టీబీజీకేఎస్ నేతలు అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంతేకాదు.. కొందరు నాయకులు టీబీజీకేఎస్‌కు రాజీనామా కూడా చేశారు. అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్యతో పాటు మరికొందరు రాజీనామాలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు సింగరేణి ఎన్నికలకు దూరంగా ఉండటం ఉంటే కాడిని వదిలేయడమే అని భావించిన బీఆర్ఎస్ తిరిగి పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రోజు వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

సింగరేణి కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చింది బీఆర్ఎస్ అని చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్‌ అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్మికుల పక్షాన నిలబడే ఏకైక సంఘం తమదే అన్నారు. సంఘం నాయకత్వ బాధ్యతల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో ఒక్క సమ్మె కూడా చేయనవసరం లేకుండా డిమాండ్లు నెరవేర్చుకున్నామని కవిత చెప్పారు.

Next Story