ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. పీఆర్సీ ఇప్పట్లో లేనట్లే..!
Shock to TS Employees on PRC.తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది.
By తోట వంశీ కుమార్ Published on 11 Feb 2021 7:15 PM IST
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. వేతన సవరణపై నేడో, రేపో ప్రకటన వస్తుందని ఎంతో ఆశతో ఎదరుచూస్తున్న వారికి నిరాశే ఎదురైంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి(ఎమ్మెల్సీ) స్థానాల భర్తీకి గాను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ ను జారీ చేయడంతో.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికలు ముగిసేవరకు పీఆర్సీ ప్రకటన లేనట్లే. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ రావచ్చని అంటున్నారు. అదే జరిగితే.. పీఆర్సీ ప్రకటన మరింత ఆలస్యం కానుంది. దీంతో జనవరి నుంచి పీఆర్సీ ప్రకటన కోసం ఎదురుచూసిన ఉద్యోగుల ఆశలు అడియాశలే అవుతాయి.
పీఆర్సీతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ చాలా కాలంగా తెలంగాణ ఉద్యోగులు పోరాడుతున్నారు. దీంతో ఉద్యోగుల పీఆర్సీపై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం 2018 మే18న సీఆర్ బిశ్వాల్ చైర్మన్‌గా మహ్మద్ ఆలీ రఫత్, ఉమా మహేశ్వరావులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దాదాపు రెండున్నర రేళ్లు అధ్యయనం చేసి 2020 డిసెంబర్ 31న నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7.5శాతం ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలని పీఆర్‌సీ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ప్రకారం కనీస వేతనం రూ.19వేలు, గరిష్ఠ వేతనం రూ.1.62లక్షలుగా ఉంది. ఉద్యోగులు, టీచర్లు, పెనన్షర్లకు 10శాతం ఫిట్‌మెంట్‌కు కమిటి సిఫారసు చేసింది.
సీపీఎస్ విధానంలో ప్రభుత్వ వాటాను 10 శాతం నుంచి 14శాతం పెంపుకు ప్రతిపాదించింది. హెచ్ఆర్ఏని 30శాతం నుంచి 24శాతానికి తగ్గిస్తూ ప్రతిపాదించడం గమనార్హం. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పెంపుకు ప్రతిపాదించింది. పీఆర్సీ కమిటి ప్రతిపాదనలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పీఆర్సీ కమిటి ఇచ్చిందే ఫైనల్ కాదని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. సీఎం కేసీఆర్ గౌరవప్రదంగానే ఇస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. కేసీఆర్ ఆదేశాలతో త్రిసభ్య కమిటీ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది.
జనవరి చివరి వారంలో ప్రకటిస్తారని తొలుత అనుకోగా.. ఆ తరువాత ఫిబ్రవరి తొలి వారంలో ప్రకటిస్తారని వార్తలు వినిపించాయి. ఈలోగా ఉద్యోగులు భయపడుతున్నట్లుగానే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 14న పోలింగ్ జరగనుండగా.. మార్చి 17న ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఎన్నికలు ముగిసేవరకు పీఆర్సీ ప్రకటించే వీలులేదు. ఈ లోపు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక షెడ్యూల్ వస్తే.. పీఆర్సీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం కావాలనే పీఆర్సీ ప్రకటనను వాయిదా వేసిందని.. ఉద్యోగులు ఆగ్రహాంగా ఉన్నారని.. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈ ప్రభావం భారీగానే పడే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. చూడాలీ మరీ సమస్యలను పరిష్కరించడంలో అపర చాణక్యుడిగా పేరు ఉన్న సీఎం కేసీఆర్.. ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో.