తెలంగాణ గవర్నర్‌గా శుక్లా ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర ఐదో గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా బుధవారం (మార్చి 11, 2026) పదవీ బాధ్యతలు స్వీకరించారు.

By -  అంజి
Published on : 11 March 2026 1:10 PM IST

Shiv Pratap Shukla, Telangana Governor, Swearing-in Ceremony, Lok Bhavan, CM Revanth Reddy, Justice Aparesh Kumar Singh, Jishnu Dev Varma, Hyderabad News

తెలంగాణ గవర్నర్‌గా శుక్లా ప్రమాణస్వీకారం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐదో గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా బుధవారం (మార్చి 11, 2026) పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో ఉదయం జరిగిన ఘనమైన వేడుకలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ బి. శివధర్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్‌గా సేవలందించిన జిష్ణుదేవ్‌ వర్మను కేంద్ర ప్రభుత్వం ఇటీవలి బదిలీల్లో భాగంగా మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. ఆయన స్థానంలో శివ ప్రతాప్‌ శుక్లా ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. శివ ప్రతాప్‌ శుక్లాకు దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి విడత ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా బాధ్యతలు చేపట్టిన శుక్లాకు వివిధ వర్గాల నుండి అభినందనలు వ్యక్తమవుతున్నాయి.

Next Story