సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడంపై షర్మిల కామెంట్లు విన్నారా?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

By Medi Samrat  Published on  21 Aug 2023 3:30 PM GMT
సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడంపై షర్మిల కామెంట్లు విన్నారా?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్‌ నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ నిర్ణయించింది కాబట్టే తాను రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ చరిత్ర మీకు తెలియదని.. కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచానని అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, నిజామాబాద్‌ జిల్లా నుంచి మంత్రి నన్ను వ్యక్తిగతంగా కోరారు. వాళ్లే కాదు.. ఇంకొన్ని జిల్లాల వాళ్లు కూడా అడిగారు. చివరగా పార్టీ సంప్రదింపులతో కామారెడ్డి ఫిక్స్‌ అయ్యాం. అంతేగానీ.. ఇందులో ఏం ప్రత్యేకత లేదని అన్నారు కేసీఆర్.

సీఎం కేసీఆర్ ప్రకటనపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు కురిపించారు. ‘గజ్వేల్ ఓటర్లు తన్ని తరిమేస్తారని దొరకు బాగా అర్థమైనట్టుంది. అందుకే, ముందు జాగ్రత్తగా రెండో స్థానం నుంచి పోటీ చేస్తున్నారు’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అనే అహంకారంలో గజ్వేల్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అన్న సంగతి కేసీఆర్ ఏనాడో మరిచిపోయారంటూ షర్మిల విమర్శలు గుప్పించారు. ‘కేసీఆర్‌కు నిజంగా దమ్ముంటే.. తన పరిపాలన మీద తనకు నమ్మకం ఉంటే, సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే గెలిచి చూపించాలి’ అంటూ ఆమె సవాల్ చేశారు. ‘స్వయానా ముఖ్యమంత్రికే సొంత నియోజకవర్గంలో గెలుస్తాననే దమ్ము లేదు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అనడానికి ఇదే సంకేతం. దొర గారు ఇన్నాళ్లూ గజ్వేల్ ప్రజలను కలిసింది లేదు. వాళ్ల గోసలు తెలుసుకున్నది లేదు. పేరుకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా డబుల్ బెడ్ రూం ఇండ్లు రాకపాయే. దళిత బంధు అందకపాయే. ఇక దొర గజ్వేల్‌లో చూపెట్టే అభివృద్ధి అంతా ఖాళీ బిల్డింగులే’ అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

Next Story