పార్టీ పేరు ఖరారు చేసిన షర్మిల.. అనుకున్నదే..

Sharmila New Political Party as YSRTP. వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో దూసుకుపోవాలని అనుకుంటూ ఉన్నారు.

By Medi Samrat  Published on  3 Jun 2021 2:29 PM GMT
పార్టీ పేరు ఖరారు చేసిన షర్మిల.. అనుకున్నదే..

వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో దూసుకుపోవాలని అనుకుంటూ ఉన్నారు. అయితే ఆమె పొలిటికల్ జర్నీకి కరోనా లాక్ డౌన్ కూడా అడ్డుపడుతూ ఉంది. అయితే ఇలాగే ఉంటే కుదరదని అనుకున్నారో ఏమో.. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం నుండి కాస్త దూకుడు పెంచారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద షర్మిల నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొండా రాఘవరెడ్డి, రాంరెడ్డి, ఇందిరా శోభన్, రాజగోపాల్‌ పాల్గొన్నారు.

ఉద్యోగం రాక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం శేరిల్ల గ్రామానికి చెందిన కొట్టమొల్ల వెంకటేశ్‌ (23) కుటుంబాన్ని ఆమె బుధవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందజేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం మళ్లీ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు సన్నగిల్లి వెంకటేశ్‌లాంటి నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని షర్మిల అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.97 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు ఖాళీ ఉన్న రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు.

తాజాగా తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. పార్టీ పేరును వైఎస్సార్ తెలంగాణ పార్టీ. ( వైఎస్సార్ టీపీ) గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. వైఎస్సార్ టీపీకి షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.


Next Story
Share it