సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని షర్మిల డిమాండ్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దైంది.
By Medi Samrat Published on 23 Sept 2023 6:45 PM ISTతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దైంది. ఇటీవల పరీక్షలు నిర్వహించినప్పుడు ఎన్నో తప్పులు జరిగాయని అభ్యర్థులు ఆరోపించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్‌లు వేశారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.
ఈ విషయంపై ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. తాజాగా వైఎస్ షర్మిల స్పందించారు. "ఉద్యమంలో గ్రూప్-1 రాయకుండ్రి, మనయ్ మనమే రాసుకుందమని రెచ్చగొట్టిన దొర.. ఎక్కడ పాయె స్వరాష్ట్రంలో పెద్ద కొలువులు? ఊరించి ఊరించి 9 ఏండ్లకు ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ గట్టు దాటక పాయె. ఒక్కరికీ ఉద్యోగం దక్కకపాయె. 503 పోస్టులకు రెండు సార్లు పరీక్షలు జరిగి రద్దైన ఘటన.. బహుశా దేశంలోనే మీ అసమర్థ విధానాలకు ఒక దర్పణం. పాలన చేతకాదనడానికి నిదర్శనం. పోటీ పరీక్షలు పెట్టరాదని బయటపడ్డ వాస్తవం. మీకు తెలిసిందల్లా పేపర్లు లీకులు చేయడమే. సంతలో కూరగాయలు అమ్మినట్లు అమ్మడమే. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటమే. TSPSC కి విశ్వసనీయత లేదని చెప్పినా.. దర్యాప్తు జరుగుతున్నప్పుడు పాత బోర్డుతో పరీక్షలు వద్దని మొత్తుకున్నా.. బయోమెట్రిక్ విధానాన్ని ఎందుకు ఎత్తివేశారని నెత్తి నోరు బాదుకున్నా.. పట్టింపు లేకుండా పరీక్షలు పెట్టిన మీకు ఇవ్వాళ హైకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు. ఆనాడే లీకుల సూత్రధారులను పక్కన పెట్టుంటే.. నిరుద్యోగుల డిమాండ్లను గౌరవించుంటే.. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ చేసుంటే.. ఇవ్వాళ మరోసారి 2.37 లక్షల మంది గ్రూప్ 1 అభ్యర్థులకు నష్టం జరిగేది కాదు.నియంత కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యత వహించాలి.నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి." అంటూ పోస్టు పెట్టారు షర్మిల.