ఆస్తులు హత్యకు కారణం కాదు : వివేకా మర్డర్‌పై షర్మిల కామెంట్స్
Sharmila Comments On Viveka Murder. వైఎస్ వివేకానందరెడ్డి గొప్ప వ్యక్తి అని, మంచి ప్రజా నాయకుడని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
By Medi Samrat Published on 26 April 2023 7:00 PM ISTవైఎస్ వివేకానందరెడ్డి గొప్ప వ్యక్తి అని, మంచి ప్రజా నాయకుడని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. బాబాయ్ తన ఆస్తులన్నింటినీ సునీత పేరు మీద రాయించారని షర్మిల చెప్పారు. అన్ని ఆస్తులు సునీత పేరు మీదే ఉన్నాయని... ఒకటి, అర ఆస్తులను కూడా సునీత పిల్లల పేరిట వీలునామా రాశారని తెలిపారు. హత్యకు ఆస్తులు కారణం కారణం కాదని, ఒక వేళ ఆస్తులే హత్యకు కారణమైతే బాబాయ్ ని కాకుండా సునీతను చంపేవాళ్లని చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేశారని.. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనేది చూడకుండా ప్రయాణిస్తూ ప్రజల కోసం వెళ్లే వారని అన్నారు. అలాంటి వ్యక్తి గురించి కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తుండటం దారుణమని అన్నారు. మన మధ్య లేని వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, ఇలాంటి కథనాలతో ఆయా సంస్థలు విలువ పోగొట్టుకోవద్దని సూచించారు.
రాజకీయాలు అంటేనే అసహ్యించుకునే తాను ఇప్పుడు తెలంగాణలోని పరిస్థితుల వల్ల రాజకీయం చేయాల్సి వస్తోందన్నారు. ప్రజలకు ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్లే తాము రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయం చేస్తున్నామన్నారు. రోడ్ల మీద పడి పోలీసులతో కొట్లాడటం నాకు అవసరమా... వాళ్లను కొట్టడమైనా... వాళ్ల చేత తిట్టించుకోవడమైనా... వాళ్ల చేత నెట్టించుకోవడమైనా నాకు అవసరమా... ఈ కేసులు నాకు అవసరమా... ఈ జైళ్లు నాకు అవసరమా... అని తెలిపింది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజకీయాలు చేయడానికి కారణం తెలంగాణలో సంక్షేమ పాలన కనిపించకుండా పోయింది కాబట్టి చెప్పుకొచ్చింది షర్మిల. తెలంగాణలో నిరుద్యోగాన్ని ఏ పార్టీలు పట్టించుకోవడం లేదు కాబట్టి, తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు షర్మిల.