ఏప్రిల్ 9న షర్మిల పార్టీ పేరు ప్రకటన..!
Sharmila Announces New Party On April 9th. వైఎస్ షర్మిల తెలంగాణలో ఏప్రిల్ 9న పార్టీ పేరును ప్రకటించాలని షర్మిల నిర్ణయించుకున్నారు
By Medi Samrat Published on 1 March 2021 9:06 PM ISTవైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ 9న పార్టీ పేరును ప్రకటించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఖమ్మంలో లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించాలని ఆమె నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా నేతలతో చర్చించిన షర్మిల.. 'వైఎస్సార్‌టీపీ, 'వైఎస్సార్‌పీటీ', రాజన్న రాజ్యం అనే పర్లను ఆమె పరిశీలించారు. మే 14 నుంచి లోటస్ పాండ్ వేదికగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సమాచారం.
అయితే ముందుగా జూలై 8న పార్టీని ప్రారంభిస్తారని అనుకున్నా.. ప్రస్తుతం ఎండల కారణంగా తేదీల మార్పు విషయంలో షర్మిల అనుచరులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో చివరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తుండగా, అదే రోజు పార్టీ పేరును సైతం ఖమ్మం సభ వేదికగానే ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే మే 14 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తేదీని పార్టీ ఏర్పాటుకు వాడుకోవాలని భావించినా.. ఎండల కారణంగా సభ పెట్టలేమని, ఆ రోజే పార్టీ వ్యవహారాలను లోటస్‌పాండ్ నుంచే ప్రారంభిస్తే బాగుంటుందన్న ఆలోచన షర్మిల ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, మంగళవారం వైఎస్ షర్మిల మహబూబ్‌నగర్ జిల్లా అనుచరులతో సమ్మేళనం నిర్వహించబోతున్నారు. దాదాపు 700 మంది ముఖ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో పాటు 5 వేల మంది వస్తారని షర్మిల అభిమానులు భావిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలను చూసి అప్పటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖరరెడ్డి చలించిపోయారని, దాదాపు జిల్లా వ్యాప్తంగా 14 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో పాటు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని, అయినా ఇంకా జిల్లాలో ఎన్నో సమస్యలున్నాయని, వాటిపై మంళవారం షర్మిల ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని అనుచరులు అంటున్నారు. కాగా, మహబూబ్‌నగర్ సమ్మేళనం తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించే అవకాశాలున్నాయి. సోమవారం ఈ అంశంపై రెండు జిల్లాల ముఖ్యనేతలతో షర్మిల సమీక్షించారు.