విషాదం నింపిన ఈదురు గాలులు.. చెట్టు మీద పడి ఇద్దరు, రేకుల షెడ్డు కూలి నలుగురి మృతి

నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి నలుగురు మృతి చెందిన ఘటన నాగర్‌ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్‌లో చోటు చేసుకుంది.

By అంజి  Published on  26 May 2024 7:15 PM IST
heavy winds, Telangana, Hyderabad, Nagar Kurnool

విషాదం నింపిన ఈదురు గాలులు.. చెట్టు మీద పడి ఇద్దరు, రేకుల షెడ్డు కూలి నలుగురి మృతి

నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి నలుగురు మృతి చెందిన ఘటన నాగర్‌ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్‌లో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం వీచిన భారీ ఈదురు గాలులకు నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో యజమాని మల్లేష్‌, పదేళ్ల చిన్నారితో పాటు ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నాగర్‌ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగుపాటుకు లక్ష్మణ్‌ (12) చనిపోయాడు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట సమీపంలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి బైక్‌ మీద పడటంతో ఇద్దరు మరణించారు. తిమ్మాయిపల్లి నుంచి శామీర్‌ పేట వెళ్లేదారిలో గాలి దుమారానికి ఓ భారీ వృక్షం విరిగి బైక్‌ మీద పడింది. ఈ ప్రమాదంలో యాదాద్రి జిల్లా బొమ్మల రామారం వాసి నాగిరెడ్డి రామ్‌రెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. బైక్‌ వెనుక కూర్చున్న ధనుంజయను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. అటు హైదరాబాద్‌ నగరంలోని అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్‌, నాగోల్‌, మన్సూరాబాద్‌, మల్కాజిగిరి, తుర్కయంజాల్‌ ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. ఈదురుగాలుల దాటికి పలు ప్రాంతాల్లో భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది చెట్లను తొలగిస్తున్నారు.

Next Story