శేరిలింగంపల్లి 'షేర్' ఎవరు.? ప్రజలు ఏమంటున్నారు.?
శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచార పర్వం జోరుగా సాగుతుంది. అభ్యర్ధులు గెలుపు కోసం చెమటోడ్చుతున్నారు
By Medi Samrat Published on 17 Nov 2023 11:13 AM ISTశేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచార పర్వం జోరుగా సాగుతుంది. అభ్యర్ధులు గెలుపు కోసం చెమటోడ్చుతున్నారు. 2002 డీలిమిటేషన్ చట్టం ప్రకారం.. 2009లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం ఆవిర్భవించింది. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా అప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న పలు ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో కలిశాయి. మియాపూర్, చందానగర్, బాలానగర్(కొంత భాగం), కూకట్ పల్లి(వార్డు నెం.1 నుంచి 4), వివేకానంద నగర్, బిహెచ్ఇఎల్, హఫీజ్ పేట, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాలను కలిపి కొత్తగా శేరిలింగంపల్లి నియోజకవర్గంగా ఏర్పాటయ్యింది.
(ఫోటో : శేరిలింగం పల్లి నియోజకవర్గం మ్యాప్)
మూడు పార్టీలను వరించిన గెలుపు..
2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకూ మూడుసార్లు ఎన్నికలు జరగాయి. అయితే.. మూడు ఎన్నికలలో మూడు పార్టీలు గెలిచాయి. నియోజకవర్గానికి తొలిసారి 2009లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం. బిక్షపతి యాదవ్(61,135 ఓట్లు), మొవ్వా సత్యనారాయణ(59,808)పై గెలుపొందారు. 2014 ఎన్నికలలో టికెట్ రాకపోవడంతో పార్టీని వీడిన బిక్షపతి యాదవ్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత 2014లో టీడీపీ తరఫున అరికపూడి గాంధీ గెలిచారు. ఆ తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌లో చేరి.. 2018లో సైతం ఈ పార్టీ నుంచే 44,295 మెజారిటీతో గొలుపొందారు. 2018 ఎన్నికల్లో గెలిచిన గాంధీని సీఎం కేసీఆర్ విప్‌గా నియమించారు. అయితే మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో విప్ పదవిని చాలా రోజులు తీసుకోలేదు గాంధీ. దీంతో అధినేతకు, గాంధీకి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అయినా కూడా బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గాంధీకే మరోమారు అవకాశం ఇచ్చింది. దీంతో ఆయన మూడోసారి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న గణనీయమైన టీడీపీ ఓటు బ్యాంక్ గాంధీకి కలిసొచ్చే అవకాశం ఉంది. టీడీపీకి 2009లో 59,808 ఓట్లు, 2018లో 99,012 ఓట్లు రాగా.. 2014లో టీడీపీ తరపున గాంధీనే గెలిచి ఎమ్మెల్యే అవడం విశేషం.
అత్యధిక ఓటర్లున్న ప్రాంతం..
శేరిలింగంపల్లిలో తెలంగాణలోనే అత్యధికంగా 7, 32, 560 మంది ఓటర్లు ఉన్నారు. శేరిలింగంపల్లిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారే ఉన్నారు. వీరంతా శాశ్వతంగా స్థిరపడిపోవడంతో ఓటర్ల సంఖ్య ప్రతిసారి అనూహ్యంగా పెరుగుతోంది. హైటెక్ సిటీ ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉండటంతో ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అయితే జనాల రద్దీ పెరిగిపోతుండటంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ప్రభుత్వం ఈ సమస్య పరిష్కానికి కొత్త రహదారులు, ఫ్లైఓవర్‌లను నిర్మిస్తోంది. కానీ.. ప్రధాన రహదారిపై ఇక్కడ ఎప్పుడో నిర్మించిన అండర్ పాస్ బ్రిడ్జ్ వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. అండర్‌పాస్‌ను మరింత విస్తరిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని అంటున్నారు స్థానికులు. వర్షం వస్తే నానా ఇబ్బందులు పడుతుంటారు. ట్రాఫిక్ మళ్లింపులు, లేదంటే వరద క్లియర్ చేసేంత వరకూ వేచి ఉండటం వంటివి జరుగుతుండటంతో అండర్ పాస్ బ్రిడ్జ్ తమ పాలిట ప్రధాన సమస్యగా చెబుతున్నారు. అయితే నాయకులు మాత్రం ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో కాస్త ఆలస్యమవుతోందని అంటున్నారు.
(ఫోటో : వర్షాకాలం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ పరిస్థితి)
ప్రధాన పార్టీల మధ్యే పోటీ..
జనాభా పరంగా అతిపెద్ద నియోజకవర్గం ఉన్న శేరిలింగంపల్లిలో ప్రధాన పార్టీ అభ్యర్ధుల మధ్యే పోటీ నెలకొంది. అయితే ప్రతి పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు ఆయ పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. అయితే.. బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ అరెకపూడి గాంధీపై మరోసారి నమ్మకముంచింది. ఇక కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నడుమ వి. జగదీశ్వర్ గౌడ్ టికెట్ దక్కించుకున్నారు. బీజేపీ నుంచి రవి కుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే అరికపూడి..
సిట్టింగ్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని ఆశిస్తున్నారు. అయితే.. ఆయనకు పోటీగా ఆశించి భంగపడ్డ మరో సీనియర్ నేత తన గెలుపుకు ఎంతవరకూ సహకరిస్తారనేది చూడాలి. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ క్యాడర్‌ను పటిష్ట పరచలేదన్న అసంతృప్తి కూడా ఎమ్మెల్యే గాంధీపై ఉంది. ఎమ్మెల్యే అనుచరులు సైతం భూవివాదాల్లో చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు ఆయనకు మైనస్‌గా ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రత్యర్థుల ఆరోపణలే కానీ వాస్తవాలు కావని ఎమ్మెల్యే పలుమార్లు ఖండించారు. మరోమారు తనదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
(ఫోటో : ప్రచారంలో ప్రస్తుత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి అరికెపూడి గాంధీ)
కాంగ్రెస్ జగదీశ్వర్ గౌడ్ పరిస్థితేంటి..
ఇక కాంగ్రెస్ పార్టీలో ఈ సారి టికెట్ రేసులో గట్టిపోటీ నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత జెర్రిపాటి జైపాల్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి వర్గం నుంచి రఘు యాదవ్, మరో సీనియర్ నేత వి. జగదీశ్వర్ గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యనారాయణరావు టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు. ఈ రేసులో చివరికి జగదీశ్వర్ గౌడ్ టికెట్ దక్కించుకున్నారు. నియోజకవర్గం ఏర్పడిన తొలిసారే.. అంటే 2009లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. బలమైన నాయకుడిని బరిలోకి దించితే విజయం ఖాయమని అధిష్టానం తీవ్ర కసరత్తు చేసింది. అయితే టికెట్ విషయంలో ఉన్న పోటీ కారణంగా నేతల మధ్య సమన్వయం కొరవడి జగదీశ్వర్ గౌడ్ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని కార్యకర్తలు అంటున్నారు. అయితే.. అందరినీ కలుపుకుని పోతూ.. సిట్టింగ్‌పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధిస్తామని జగదీశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
(ఫోటో : ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్ధి జగదీశ్వర్ గౌడ్)
భిన్నంగా బీజేపీ..
ఇక బీజేపీలో పరిస్థితి భిన్నంగా ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన యోగానంద్‌కు ఈ సారి టికెట్ దక్కలేదు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ తనయుడు, యువకుడు రవి కుమార్ యాదవ్‌కు టికెట్ దక్కింది. రవి కుమార్ యాదవ్ బండి సంజయ్ వర్గం కాగా.. యోగానంద్ కిషన్ రెడ్డి వర్గం. చివరి వరకూ యోగానంద్, రవి యాదవ్ వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఇద్దరి అనుచరులు బాహాబాహీకి దిగిన ఘటనలు కూడా ఉన్నాయి. టికెట్ కోసం ఇరువురూ చాలా సీరియస్‌గా ప్రయత్నించారు. చివరికి రవికే టికెట్ దక్కింది. అయితే.. ఇరువర్గాల వైరం రవి కుమార్ యాదవ్ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని బీజేపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే.. జనసేన, బీజేపీ పొత్తు రవి కుమార్ యాదవ్ కు కలిసొచ్చే అవకాశం ఉంది. ఏపీలో జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో.. ఆ ప్రభావం ఈ నియోజకవర్గంలో కాస్తా ఎక్కువగా ఉంటుందనేది సెటిలర్ల వాదన. ఇవన్ని రవి కుమార్ యాదవ్‌కు ఏ మేరకు కలిసొస్తాయనేది చూడాలి.
(ఫోటో : ప్రచారంలో బీజేపీ అభ్యర్ధి రవి కుమార్ యాదవ్)
స్థానికులు ఏమంటున్నారంటే..
సందీప్ (స్థానికుడు) : నా వయసు 40 ఏళ్లు. నేను గత 20 ఏళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను. స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి. నేతలు ఎన్నికల సమయంలో మాత్రమే జనాల వద్దకు వస్తున్నారు. అండర్ బ్రిడ్జి సమస్య నాకు ఊహ తెలిసిన దగ్గరి నుంచి ఉంది. వర్షం వస్తే చాలా ఇబ్బందులు పడుతాం. పుల్‌గా ట్రాఫిక్, కాలుష్యం.. ఈ సమస్యను పట్టించుకున్న నాధుడే లేడు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి అబివృద్ధి చెందిన ప్రాంతాలున్నా.. మా లింగంపల్లిలో మాత్రం సమస్యలకు కొదువలేదు. ఎవరు గెలిచినా స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితే బాగుంటనేది నా అబిప్రాయం.
ప్రసాద్(క్యాబ్ డ్రైవర్) : మా స్వస్థలం రాజమండ్రి. నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు మా కుటుంబంతో ఇక్కడికి వచ్చాం. ప్రస్తుతం నా వయసు 45 ఏళ్లు. ఇక్కడే స్థిరపడ్డాం. పిల్లలు కూడా ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. కొంత కాలం పండ్ల వ్యాపారం చేసిన నేను.. ప్రస్తుతం క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాను. ఉండటానికి అంతా ఎటువంటి ప్రాబ్లం లేదు. అండర్ బ్రిడ్జి సమస్య ఉంది. రేషన్ కార్డ్, డబుల్ బెడ్ రూమ్ వంటి పథకాలు మా వరకూ వస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం. గత రెండు పర్యాయాలు మేము గాంధీ వైపే నిలబడ్డాం. ఈ సారి కూడా మా నిర్ణయం మాకు మేలు చేసేవారికి సానుకూలంగా ఉంటుంది.